జనసేన పార్టీ లైమ్‌లైట్‌లోకి వస్తుందా.? ఏమో, వచ్చే అవకాశాలు కన్పించడంలేదుగానీ.. కాస్త హడావిడి అయితే చేస్తోందనే అన్పిస్తోంది. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వివాదాలపై స్పందించేందుకు పవన్ మీడియా ముందుకొచ్చి, ఏవేవో మాట్లాడేసిన విషయం విదితమే. పవన్ మాటలకి తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోపాటు బీజేపీ ఘాటుగా స్పందించాయి. మామూలుగా అయితే మాట్లాడేసి ఊరుకోవడం పవన్‌కళ్యాణ్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఈసారి కాస్త డిఫరెంట్‌గా, తన వ్యాఖ్యలకు వచ్చిన స్పందన చూసి, మళ్ళీ స్పందించేశాడు. అంతే అభిమానులు పవనిజంతో ఊగిపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలలో పవన్ పార్టీ జనసేన జెండాల్ని పట్టుకుని అతని అభిమానులు సందడి చేశారు. టీడీపీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. 'చేతనైతే పవన్ ప్రశ్నలకు సమాధానమివ్వండి.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించండి..' అంటూ జనసేన కార్యకర్తలుగా మారిన పవన్ అభిమానులు, టీడీపీ ఎంపీలకు సవాల్ విసిరేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సందడి ఎన్నాళ్ళు కొనసాగుతుందోగానీ, జనసేన జెండాలు రానున్న రోజుల్లో బాగానే ఎగురుతాయన్న నమ్మకానికి పవన్ అభిమానులు వచ్చేసినట్లే కన్పిస్తోంది. మరోపక్క తెలంగాణలోనూ పవన్ అభిమానులు హడావిడి షురూ చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, పవన్‌ని ఉద్దేశించి 'ప్యాకేజీ పవన్' అని విమర్శించడాన్ని నిరసిస్తూ, జనసేన కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే పోలీస్ స్టేషన్‌లో నిన్న తెలంగాణ న్యాయవాదులు పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

0 comments:
Post a Comment