Tuesday, 7 July 2015

నోటికోచినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదు పవన్ పై టిడిపి ఎంపి ల ఫైర్

''ఆర్నెళ్ళకోసారి నిద్రలోంచి లేచేవారికి మేమేం చేస్తున్నామో ఎలా తెలుస్తుంది.? మీ అన్నయ్య ఎంపీనే కదా, ఆయన వ్యాపారాలు చేయడంలేదా.? నాయకుడంటే జనంలో వుండాలి, అంతే తప్ప గుర్తుకొచ్చినప్పుడే మీడియా ముందుకొస్తానంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.. మిత్రధర్మాన్ని గౌరవించాలి.. అధినేత స్థాయిలో చర్చలు జరపాలి. నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు..''  అబ్బో, టీడీపీ నేతలు జనసేన అధినేత.. సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌పై గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఖబడ్దార్‌.. అని అనలేదుగానీ, ఆ స్థాయిలో పవన్‌పై టీడీపీ నేతలు, మరీ ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు విరుచుకుపడ్డారు. 'సెక్షన్‌ 8 వద్దంటావా.. అది విభజన చట్టంలో భాగం, విభజన చట్టంలో భాగమైనప్పుడు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు సెక్షన్‌ 8 ఖచ్చితంగా అమలయి తీరాలి కదా..' అని టీడీపీ ఎంపీలు పవన్‌పై మండిపడ్డారు.  ''ఓహో.. సినీ నటుడివి కదా! నీ సినిమాలు తెలంగాణలో ఆడాలి గనుక, కేసీఆర్‌ని కాకా పడ్తున్నావ్‌. ఆంధ్రోళ్ళని తరిమికొడ్తానని చెప్పిన కేసీఆర్‌, పవన్‌కి తెలుగు ప్రజల సమైక్యత కోసం పాటుపడే వ్యక్తిలా కన్పించడమేంటి.?'' అని ఎంపీలు ఘాటుగా పవన్‌ని కడిగి పారేశారు.  వెనకటికి తిట్టను పోరా సన్నాసీ.. అన్న చందాన, పవన్‌ని రాజకీయ మిత్రుడని సంబోదిస్తూనే, పవన్‌పై ఎన్నెన్ని విమర్శలు చేయాలో అన్నీ చేసేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. పక్కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచనల ప్రకారమే టీడీపీ ఎంపీల విమర్శలు సాగినట్లు కన్పిస్తోంది. పవన్‌ ప్రతి ప్రశ్నకూ టీడీపీ ఎంపీలు సమాధానం చెబుతూనే ఎదురు ప్రశ్నలు సంధించారు. 

0 comments:

Post a Comment